హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ'

  • హైదరాబాద్ అభివృద్ధికి 'హెచ్-సిటీ' పేరిట ప్రభుత్వ కొత్త ప్రణాళిక
  • మౌలిక వసతుల కోసం రూ.7,042 కోట్లకు పరిపాలనా అనుమతులు
  • కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.1,090 కోట్లు
  • ముగింపు దశకు నల్గొండ ఎక్స్ రోడ్స్-ఐఎస్ సదన్ ఫ్లైఓవర్ పనులు
  • పెండింగ్ పనుల పూర్తితో నగరంలో ట్రాఫిక్ రహిత ప్రయాణం లక్ష్యం
హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 'హెచ్-సిటీ' (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) అనే బృహత్తర ప్రాజెక్టును పట్టాలెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో మొదలై అసంపూర్తిగా ఉన్న వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్‌డీపీ) పనులతో పాటు కొత్తగా గుర్తించిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి నగర రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం రూ.7,042 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో సింహభాగమైన రూ.5,942 కోట్లను 'హెచ్-సిటీ' పనులకే కేటాయించడం గమనార్హం.

ఈ ప్రాజెక్టు అమలును వేగవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల కమిషనర్లు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రతివారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ప్రాజెక్టులో భాగంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.1,090 కోట్లతో భారీ నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనిని రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీలో రూ.580 కోట్లతో కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్లలో రెండు స్టీల్ బ్రిడ్జిలు, మూడు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీ కింద రూ.510 కోట్లతో ఫిల్మ్‌నగర్, రోడ్డు నంబర్ 45 జంక్షన్ల వద్ద మరో నాలుగు స్టీల్ బ్రిడ్జిలు, నాలుగు అండర్‌పాసులు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు దక్షిణ హైదరాబాద్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నల్గొండ ఎక్స్ రోడ్స్-సైదాబాద్-ఐఎస్ సదన్ -ఓవైసీ జంక్షన్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. సుమారు 2.5 కిలోమీటర్ల పొడవుతో రూ.620 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పాతబస్తీ, కొత్త నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేసి, హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

H-City Project
Hyderabad
Traffic Management
RV Karnan
GHMC
SRDP
KBR Park
Nalgonda X Roads
Flyover Construction
Telangana

More Telugu News